Weather | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రుల్లో చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మారిన వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అటువైపు నుంచి వీస్తున్న గాలులతో పగటి పూట ఎండ, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడుతున్నదని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల నుంచి గాలులు వీచడం వల్ల గాలిలో తేమశాతం తగ్గుతున్నదని పేర్కొన్నారు. ఈ వాతావరణం ఈనెల 19 వరకు కొనసాగుతుందని..18,19 తేదీల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా బేలా, కొమరంభీం జిల్లా రెబ్బన 40.6, భదాద్రి- కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి, మంచిర్యాల జిల్లా నెన్నెల్, ములుగు జిల్లా వాజేడు, నిజామబాద్ జిల్లా కోటగిరిలో 40.4తోపాటు మరికొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.