హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం బాధ్యత నిర్మాణ సంస్థ మెఘాదేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టులో ఈ నెల 2న ఉదయం ప్రమాదం జరిగిందని, అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
నాసిరకం నిర్మాణం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారని, గత ప్రభుత్వ తప్పిదం వల్లే జరిగిందని చెప్పి మంత్రులు భట్టి విక్రమార, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్రెడ్డి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుందని, అయినా ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను కొత్త ప్రభుత్వం ఎందుకు పర్యవేక్షించలేదని ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్రెడ్డి వైఫల్యమని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ ఒక్క కంపెనీకే కట్టబెడుతున్నారంటూ గతంలో కాంగ్రెస్ విమర్శించిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదేపని చేస్తున్నదని ఆరోపించారు. అమృత్ పథకం కింద కేంద్రం ఇచ్చిన పనులను రేవంత్రెడ్డి ప్రభుత్వం మెఘా సంస్థకు కట్టబెట్టిందని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో నిర్మించబోయే కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా ఆ కంపెనీకి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనను గోప్యంగా ఉంచడంలో బాధ్యులెవరో తేల్చి, వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాని, ప్రమాద విషయాన్ని మెఘా కంపెనీ ప్రభుత్వం దృష్టికి తెచ్చిందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని, ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.