హైదరాబాద్ : త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన అర్హులకు పదవులు దక్కకుంటే గాంధీ భవన్ ముట్టడిస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. తాజాగా నాకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తానని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా నేను అర్హురాలినని స్పష్టం చేశారు.
నన్ను ఎమ్మెల్సీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. పదవి దక్కకుంటే పీసీసీ చీఫ్ని అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణతో ఎన్ని గొడవలు అవుతాయోనని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటుంటే వాటికి తోడుగా నామినేటెడ్ పోస్టుల గొడవ తమ ప్రాణం మీదకు వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. గతంలతోనే యాదవులకు కేబినెట్లో చోటు దక్కకపోవడంతో గాంధీ భవన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.