హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తాను చేసిన తప్పేంటో పార్టీ పెద్దలే చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు కోరారు. పార్టీ పదవుల విషయంలో ఇటీవల కొంతమంది మహిళా నేతలతో గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ చాంబర్ ఎదుట బైఠాయించిన నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వారంలోగా సమాధానం ఇవ్వాలని సునీతారావుకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆల్కాలాంబా అల్టిమేటం జారీచేశారు.
ఈ నేపథ్యంలో సునీతారావు గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ పీసీసీ ఉపాధ్యక్షుడు కుసుమకుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు తనకెలాంటి షోకాజ్ నోటీసు అందలేదని తెలిపారు. నోటీసు వస్తే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశాక పీసీసీ చీఫ్‌ను కలుస్తానని పేర్కొన్నారు. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.