Congress | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న ‘నారీ న్యాయ్’ ఎక్కడ అమలవుతున్నదని నిలదీశారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘పార్టీ కోసం ఏండ్ల నుంచి పనిచేస్తున్నాను. మహిళా కాంగ్రెస్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. కానీ నా లాంటి వాళ్లకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ తగిన గుర్తింపు లభించడం లేదు. పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓడిపోయే గోషామహల్ సీటును నాకు అంటగట్టారు.
తర్వాత పట్టించుకోవడమే మానేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైన నా ఫోన్‌కు స్పందన లేదంటే ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ వాటన్నింటిని దిగమింగాను. సరైన న్యాయం జరుగని నాలాంటివాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఓ సాటి మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకునే బాధ్యత దీపాదాస్ మున్షీకి లేదా? అసలు ఆమె ఫోన్ ఎత్తకపోవడానికి కారణమేంటి? పార్టీ మహిళా అధ్యక్షురాలికి ఇచ్చే గౌరవం ఇదేనా? పార్టీ జెండాలు మోసిన మా లాంటి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని కేసీ వేణుగోపాల్‌లాంటి అగ్రనేతల దృష్టికి తీసుకెళ్తాను’ అని పేర్కొన్నారు.