చిక్కడపల్లి, డిసెంబర్ 9: రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ చేసి మిగతా రైతులను రేవంత్ సర్కారు నిండా ముంచిందని వక్తలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
సదస్సులో పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ బాబూరావు, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్ జీవన్ కుమార్, న్యాయవాది కట్టా భగవంత్‌రెడ్డి, సామాజిక విశ్లేషకులు దొంతి నర్సింహారెడ్డి, కన్నెగంటి రవి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొని మాట్లాడారు. రైతులందరికీ ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించి ఏడాది కావొస్తున్నదని, ఇప్పటి వరకు మూడు విడుతల్లో కేవలం 40 శాతం మందికే మాఫీ చేశారని తెలిపారు. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు.