Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.4, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.3, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.1 డిగ్రీల చొప్పున అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం జయశంకర్ ములుగు, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అకడకడా ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో వర్షాలు పడ్డాయని పేరొంది. గురువారం కూడా మరిన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.