ఎండల తీవ్రత దృష్ట్యా సమయం తగ్గింపు
ఎండలో ఉపాధిహామీ కూలీలకు పని వద్దు
ఓఆర్ఎస్, అంబులెన్స్‌లు సమకూర్చుకోవాలి
దవాఖానల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాలి
జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 30 : ఎండల తీవ్రత నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11: 30 గంటల వరకే పాఠశాలలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాల డీఈవోలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. కుదించిన వేళలు ఏప్రిల్ ఆరో తేదీవరకు అమలులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొన్నది. అంతకుముందు బడులు నడిపే సమయాన్ని తగ్గించాలని కలెక్టర్ల సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడింది. ఎండల తీవ్రత నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ, విపత్తుల నిర్వహణశాఖ అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున పాఠశాలల నిర్వహణ సమయాన్ని తగ్గించాలని ఆదేశించారు.
ఉపాధి హామీ కూలీలు ఎండలో పనిచేయకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని కోరారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపకశాఖను అప్రమత్తం చేయాలని సూచించారు. రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరించినందున, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బందిని అన్నివేళలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్‌లు సమకూర్చుకోవాలని కోరారు. ఎండల వల్ల కలిగే దుష్ప్రభావాలపై జాగ్రత్తలు తీసుకొనేలా ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. టెలికాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీ రాజ్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పాల్గొన్నారు.