Residential Schools | మధిర రూరల్/రఘునాథపాలెం, డిసెంబర్ 31 : ఖమ్మం జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మాడుగుల సాయివర్ధన్ (17) మధిర మండలం కృష్ణాపురం సోషల్ వెల్ఫేర్ బాలుర జూనియర్ కళాశాల (టీజీఎస్డబ్ల్యూజేసీ)లో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లి సోమవారం మధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చాడు. తోటి విద్యార్థులతో రాత్రి 10 గంటల వరకు కలిసే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ పైఅంతస్తులో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు గురుకులానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మరణిస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, డిప్యూటీ సీఎంతోపాటు ఇద్దరు మంత్రులున్నా జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని అన్నారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్డీవో నర్సింహారావు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, హౌస్ మాస్టర్ మోషేను సస్పెండ్ చేశారు.
Tgswrs
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
సాయివర్ధన్ మృతదేహాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సందర్శించారు. విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు.
చింతగుర్తిలో ఎలుకల మందు తాగి..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన కుక్కల భార్గవ్ (17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన భార్గవ్‌ను తిరిగి హాస్టల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన భార్గవ్ డిసెంబర్ 27న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దవాఖానకు తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందాడు.