మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 15: తన భూమిని తహసీల్దార్, ఆర్ఐ రిజిస్ట్రేషన్ చేయకపోగా, డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన రైతు తన ఆటోకు నిప్పంటించి కటుంబం సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకున్నది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన రైతు శంకర్ వారసత్వంగా ఉన్న భూమిని ఓఆర్సీ కోసం జూలైలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించగా తన దరఖాస్తు వచ్చిందని, మాన్యువల్‌గా తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సిఫారసు చేసిన కాగితాలు ఇవ్వాలని కోరగా అధికారులు స్పందించలేదు. దీంతో విసుగుచెంది భార్య, ముగ్గురు ఆడపిల్లలతో కలిసి మహబూబ్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని తన ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకొని, కుటుంబసభ్యులపై పోయడానికి యత్నించగా వారు అరవడంతో స్థానికులు అడ్డుకుని రైతు కుటుంబాన్ని రక్షించారు. ఈ ఘటనలో ఆటో మంటల్లో కాలిపోయింది.