నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్ ; రుణం తీసుకోకున్నా.. రుణమాఫీ అయినట్టు మెసేజ్‌లు రావటంతో రైతులు అవాక్కయిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్నది.నాలుగైదు రోజలుగా రైతులు నిజామాబాద్‌లోని నాందేడ్వాడ యూనియన్ బ్యాంక్‌కు వెళ్లి ఆరాతీయగా, కామారెడ్డి జిల్లాలోని మాగి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట రుణాలు తీసుకున్న విషయం బయటపడింది. అవాక్కయిన రైతులు చెరుకు ఫ్యాక్టరీ వద్ద రాస్తారోకో చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఎంతమంది రైతుల మీద ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకున్న విషయమై ఆరా తీస్తున్నది.
తమకు తెలియకుండా వేరే ఖాతాలు ఏమిటి? అందులో రుణాలు ఎలా ఇచ్చారో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నో డ్యూ సర్టిఫికెట్ లేకుండా మరో బ్యాంకులో తమ పేర్లపై రుణాలు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద రైతుల పట్టా పాస్‌బుక్, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుగానే తీసుకున్న సంతకాల తో రుణాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఫ్యాక్టరీ యాజమాన్యానికి రుణాల కోసమని ఎలాంటి పత్రాలు ఇవ్వలేదని, బై బ్యాక్ ఒప్పందాలపై సంతకాలు మినహా మిగిలిన వ్యవహారాలు తమకేమీ తెలియదని రైతులు చెప్తున్నారు. బైబ్యాక్ ఒప్పందాల్లో భాగంగా ఈ తంతు జరిగినట్టు స్పష్టం అవుతున్నది. సమగ్ర విచారణ చేపట్టి, ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.