హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సలహాదారుగా నియమితుడైన పీ సుదర్శన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కే ప్రేమ్‌సాగర్‌రావు ఆయా పదవులను స్వీకరిస్తారా? లేదంటే బాధ్యతలు స్వీకరించకుండా నిరాకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే లు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారన్న పేరున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, కాంగ్రెస్ అధికారంలో రావడంతో తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కోటాలో వీరికి మంత్రి పదవి ఖాయమని వారి అనుచరులు భావించారు. కానీ, రెండేండ్లయినా మంత్రి పదవి దక్కలేదు. జూన్‌లో చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరికి మాత్రమే మంత్రి పదవులు దక్కగా, క్యాబినెట్లో మరో మూడు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
దీంతో తదుపరి విస్తరణలోనైనా తమకు మంత్రి పదవి దక్కుతుందని వీరు ఆశించారు. కానీ, తాజా విస్తరణలో ఒక్క అజహరుద్దీకే చోటు కల్పించారు. అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శాసనసభలో (ఎమ్మెల్యే), శాసనమండలిలో (ఎమ్మెల్సీ) సభ్యుడుకాని అజారుద్దీన్‌ను ముస్లిం మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఇదే సమయంలో మంత్రి పదవి ఖాయమనుకున్న బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకు క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవులు మాత్రమే దక్కాయి. దీంతో వారి అనుచరగణం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడినప్పటికీ, ఈ ఇద్దరు నేతలు ఆయా పదవులను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.