హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కొత్త పట్టాదార్ పాస్‌బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ధరణిలో వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్‌బుక్ ఉంటేనే వారసులు ఆ భూమిని పంచుకునేందుకు అవకాశం ఉండేది. వివిధ కారణాల వల్ల తమకు పాస్‌బుక్ రాలేదని, భూ యజమాని మరణించడంతో తమకు హక్కుల మార్పిడి జరగడం లేదని ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో ‘అప్లికేషన్ ఫర్ సక్సెషన్’ మాడ్యూల్లోనే పాస్‌బుక్ లేకున్నా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ముందుగా ‘అప్లికేషన్ వితవుట్ పాస్‌బుక్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత భూమి వివరాలు, మరణించిన వ్యక్తి వివరాలు, వారి వారసుల వివరాలు నమోదుచేయాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఆ వ్యక్తికి చెందిన ఏదైన గుర్తింపు కార్డు, ఎవరికి ఎంత వాటా కావాలో నిర్ణయించుకొని కుటుంబం మొత్తం కలిసి రాసుకున్న ఒప్పంద పత్రాన్ని (జాయింట్ అగ్రిమెంట్) అప్లోడ్ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత దానిని అనుమతించడం లేదా తిరస్కరించడం చేస్తారు. సమాచారం నేరుగా దరఖాస్తుదారుకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఒకవేళ అనుమతిస్తే వారసులు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి సక్సెషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మాత్రం ఈ ఆప్షన్ వర్తించదని అధికారులు తెలిపారు.