కొండాపూర్ : రైట్ నెక్ లింఫాంజియోమా ( Lymphangioma ) తో 25 ఏండ్లుగా బాధపడుతున్న వ్యక్తికి హైటెక్ సిటీ మెడికవర్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను( Successful Surgery ) పూర్తి చేసి నయం చేశారు. దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ(Dr. Rahul Lakshminarayana) వివరాలను వెల్లడించారు.
నగరానికి చెందిన ఓ వ్యక్తి (40) కి మెడలో కీలకమైన నరాలు, రక్తనాళాలు, అన్ననాళం, శ్వాసనాళం సమీపంలో లింఫాంజియోమా ఏర్పడటంతో ఇబ్బందులకు గురయ్యాడు. గతంలో మూడు సార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, తిరిగి రావడంతో బాధితుడు మెడికవర్ వైద్యులను సంప్రదించాడు.
రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట్ పవన్, అనస్తేషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం రోగికి అత్యంత క్లిష్టమైన రికన్స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
పునరావృత లింఫాంజియోమాలు సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడినవనీ, వీటి ద్వారా తీవ్రమైన రక్తస్రావం, నరాల గాయాలు, అంతర్గత అవయవాల గాయాల ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో పాటు ప్రస్తుతం రోగి మెడ కదలికలు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి నరాల బలహీనత ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు.