ఖైరతాబాద్, సెప్టెంబర్ 20: నిమ్స్ దవాఖాన 20మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. నిమ్స్ దవాఖాన కార్డియోథోరాసిక్, వ్యాస్కులర్ విభాగం, యూకే వైద్యుల బృందం సంయుక్తాధ్వర్యంలో ఈనెల 15నుంచి 19వరకు చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం బ్రిటన్ వైద్య బృందంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప వివరాలు వెల్లడించారు. నాలుగేండ్లుగా కార్డియోథోరాసిక్, వ్యాస్కులర్ విభాగాధిపతి డాక్టర్ ఎం అమరేశ్‌రావు, యూకేకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ డీ రమణ నేతృత్వంలో బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ దవాఖానల్లో సుమారు రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఖర్చువుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్లతో నిమ్స్‌లో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ అమరేశ్‌రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎక్మో చికిత్సకు ప్రైవేట్ దవాఖానలో భారీ డిమాండ్ ఉండేదని, కొందరు ఈ చికిత్స కోసం రూ.7 కోట్ల నుంచి రూ.8కోట్ల వరకు ఖర్చు చేసుకున్నారని, ప్రస్తుతం ఈ చికిత్స నిమ్స్ దవాఖానలో ఆరోగ్యశ్రీతో ఉచితంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ.. నిమ్స్ దవాఖానలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.