హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): విషపూరిత కలుపు మందు తాగిన ఓ బాలుడికి యశోద దవాఖాన వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేసి ఆ బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి అతిపిన్న వయస్కుడికి డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్‌తో చరిత్ర సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్‌కుమార్, సుమలత కుమారుడు అనురాగ్ సందీప్ (12) మార్చి 15న ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ (విషపూరిత కలుపు మందు) తాగాడు.
దీంతో ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సహా పలు అవయవాలు పనిచేయక ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ బాలుడిని ఏప్రిల్ 21న సోమాజిగూడలోని యశోద దవాఖానలో చేర్చారు. ఆ వెంటనే ఊపిరితిత్తుల వైద్యనిపుణులు డాక్టర్ విశ్వేశ్వరన్, డాక్టర్ చేతన్రావు, డాక్టర్ పంక్తి శేథ్, డాక్టర్ రమ్యారెడ్డి, డాక్టర్ కేఆర్ బాలసుబ్రమణియన్, డాక్టర్ మంజునాథ్ బేల్ రంగంలోకి దిగారు. హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో ఆ బాలుడికి బైలేటరల్ లోబార్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు యశోద గ్రూప్ హాస్పటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ కోరుకంటి వివరించారు. ‘జీవన్ దాన్’ సంస్థ సహకారంతో బ్రెయిన్ డెడ్ అయిన దాత నంచి ఊపిరితిత్తులను సేకరించి ఆ బాలుడికి అమర్చినట్టు తెలిపారు.