హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికి పదోన్నతి కల్పించే ఫైల్‌ను వెంటనే సమర్పించాలని ఇంటర్ విద్య కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. పద్మావతికి లైబ్రేరియన్‌గా పదోన్నతి కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యవైఖరిని ఎండగడుతూ ఆదివారం ‘అమరుడి భార్యకు అష్టకష్టాలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇంటర్ విద్య కమిషనర్.. పద్మావతి పదోన్నతికి సంబంధించి ఆదేశాలిచ్చారు.
గురుకుల సిబ్బందికి బదిలీ ఆర్డర్లు ఫోర్త్‌క్లాస్ ; ఎంప్లాయీస్‌కు ఊరట
హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని నాలుగో తరగతి సిబ్బందికి ఎట్టకేలకు బదిలీ ఆర్డర్లు వెలువడ్డాయి. ‘బదిలీ అయినట్టా? కానట్టా?’ శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. బోధన సిబ్బంది బదిలీ ప్రక్రియ ముగిసిన 45 రోజుల అనంతరం తాజాగా వీరి బదిలీలకు అవకాశం కల్పించారు. సొసైటీ పరిధిలో నాలుగో తరగతి ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్లు మొత్త కలిపి దాదాపు 400 మందికి పైగా ఉన్నారు. బోధన సిబ్బందితోపాటు బదిలీ కోసం జూలై 31న కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే నెలన్నర రోజులు గడచినా అందుకు సంబంధించిన ఉత్తర్వులను సొసైటీ ఉన్నతాధికారులు వెలువరించలేదు. నమస్తే తెలంగాణ కథనంపై స్పందించిన సొసైటీ ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల వివరాలను కలెక్టర్లకు పంపించారు.