భైంసాటౌన్, సెప్టెంబర్ 30: సర్పంచ్‌పై ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు చెప్పుతో దాడి చేశారు. వీరంతా బీజేపీకి చెందిన వారు కావడం గమనార్హం. కలకలం సృష్టించిన ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాం(బి) గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. సర్పంచ్ అప్పాల రాకేశ్ చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని, నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, పంచాయతీ ట్రాక్టర్‌ను సొంత పనులకు వినియోగించుకుంటున్నారని కలెక్టర్‌కు ఇటీవల ఉపసర్పంచ్ శారదతోపాటు ఆమె భర్త ఎంపీటీసీ సభ్యుడు కోటగిరి పోశెట్టి ఫిర్యాదు చేశారు. డీఎల్పీవో శివకృష్ణ, పంచాయతీ రాజ్ ఏఈ పంచాయతీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకున్నారు. కోపొద్రిక్తురాలైన ఉప సర్పంచ్ శారద సర్పంచ్‌పై చెప్పుతో, ఎంపీటీసీ పోశెట్టి కాళ్లతో తన్నుతూ దాడికి దిగారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శిపైనా దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. కంగుతున్న డీఎల్పీవో విచారణ నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొందరు యువకులు సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిపై దాడి చేశారు. బీజేపీకి చెందిన ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు సొంత పార్టీ సర్పంచ్‌పైనే ఇలా దాడి చేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది.