మేడ్చల్ కలెక్టరేట్/సూర్యాపేటసిటీ, జూన్ 3: అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. మేడ్చల్ మల్కాజిగిరిలో జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వెంకటనర్సిరెడ్డి, సూర్యాపేటలో సబ్‌రిజిస్ట్రార్ బానోతు సురేందర్నాయక్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వెంకట నర్సిరెడ్డి రూ.45వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌కు చిక్కాడు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండకు చెందిన కేతావత్ రమేశ్ రూ.53 లక్షలతో టీఎస్ ప్రైడ్ పథకం కింద టిప్పర్‌ను కొనుగోలు చేశాడు. వాహన తనిఖీకి వచ్చిన ఏడీ వెంకట నర్సిరెడ్డి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేందుకు రూ.45వేలు లంచం అడిగాడు. రమేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సోమవారం జీడిమెట్లలో ఏడీ వెంకట నర్సిరెడ్డి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు తీసుకువచ్చి, ఆయన కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.
ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.లక్ష డిమాండ్
ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ సురేందర్‌నాయక్ రూ.99,200 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యాపేటలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన మేక వెంకటేశ్వర్లుకు పట్టణం లో 1080 గజాల ఖాళీ స్థలంలో 160 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను తన కూతురు మేక మానస పేరున గిఫ్ట్ డీడ్‌గా, మిగిలిన భూమిని మేడిపల్లి రవిరాజా పేరున సేల్ డీడ్‌గా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సబ్‌రిజిస్ట్రార్ రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తి తంగెళ్ల వెంకట్‌రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ కల్లూరి శ్రీనివాస్ ద్వారా బాధితుడు సబ్ రిజిస్ట్రార్‌కు ఆయన చాంబర్లో రూ. 99,200 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఏసీబీ కేసుల కోర్టు ప్రత్యే క న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.