(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండే శిశువు భవిష్యత్తు ఆరోగ్యం.. బయటకు వచ్చే మార్గాన్ని బట్టి మారుతున్నదని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ, చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లలతో పోలిస్తే, సాధారణ ప్రసవం ద్వారా జన్మించే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. చైనాలోని 1,505 మంది తల్లులు, నవజాత శిశువులపై ఐదేండ్లపాటు జరిపిన పరిశోధనలను బట్టి ఈ ధ్రువీకరణకు వచ్చినట్టు వెల్లడించారు.
సిజేరియన్ ద్వారా పుట్టిన నవజాత శిశువులకు తట్టు నిరోధక వ్యాక్సిన్ (మీజల్ టీకా)ను ఇచ్చినప్పుడు రోగనిరోధక శక్తిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. బూస్టర్ డోసు ఇచ్చిన తర్వాతనే కొద్ది మొత్తంలో యాంటిబాడీలు తయారయ్యాయి. అయితే, నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లల్లో సాధారణంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నదని, వారికి తొలి డోసు టీకా ఇవ్వగానే, యాంటిబాడీలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యి.. రోగనిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. సిజేరియన్ డెలివరీలో పుట్టిన పిల్లలతో పోలిస్తే, సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఎదురైనట్టు, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా పరిశోధకులు వివరించారు. అయితే, ఎందుకు ఇలా జరుగుతున్నదన్న విషయాన్ని వెల్లడించలేదు.