హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. అసలు వస్తుందా? రాదా? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి 7 నెలలు గడుస్తున్నా, విదేశాల్లో అభ్యాసం పూర్తయ్యేందుకు సమయం దగ్గరపడుతున్నా తుది జాబితాపై ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది.
మరోవైపు స్కాలర్‌షిప్‌పై ఆశతో విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఆయా దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుదిజాబితా ఎప్పుడు ప్రకటిస్తారని బీసీ సంక్షేమశాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఇంకా కొత్త మార్గదర్శకాలు రాలేదని చెప్తున్నారు. గత ఫాల్ సీజన్‌కు దరఖాస్తు చేసుకుని విదేశాలకు వెళ్లిన విద్యార్థుల్లో కొందరు ఇప్పటికే 2 సెమిస్టర్లను పూర్తి చేసుకున్నారు. మిగిలినవారు త్వరలో మూడో సెమిస్టర్ పూర్తిచేసి విదేశీ విద్యాభ్యాసాన్ని ముగించనున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. దీంతో తదుపరి ఫీజులను ఎలా చెల్లించాలో తెలియక ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తదితర దేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారికి అక్కడ కనీసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా దొరకడం లేదని, ఖర్చులకు సైతం ఇక్కడి నుంచే పంపాల్సి వస్తున్నదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించపోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి విదేశీవిద్యానిధిపై నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పేదింటి బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులు అభ్యసించేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని, ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని, మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్, నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం వివేకానందా ఓవర్సీస్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది.
ఈ పథకాల కింద ప్రతి సంవత్సరం ఫాల్ సీజన్ (జనవరి)లో 150 మందిని, స్ప్రింగ్ సీజన్ (ఆగస్టు)లో 150 మందిని కలిపి రెండు సెషన్లకు 300 మంది నిరుపేద బీసీ విద్యార్థులను, 250 మంది ఎస్సీ, ఎస్టీల విద్యార్థులను ఎంపికచేసి, ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని, వీసాతోపాటు ప్రయాణ ఖర్చులకు గరిష్ఠంగా రూ.50 వేలు అందజేసింది. జ్యోతిబా ఫూలే విద్యానిధి పథకంలోని మొత్తం సీట్లలో 30 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ)విద్యార్థులకు కేటాయించింది.
ఆ క్రమంలో 2023లో స్ప్రింగ్ సీజన్‌కు దరఖాస్తులను స్వీకరించాక లబ్ధిదారుల ఎంపిక పూర్తికాకముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి విదేశీ విద్యానిధి పథకానికి గ్రహణం పట్టింది. గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సీజన్లవారీగా దరఖాస్తులను స్వీకరించడం, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించడం, లబ్ధిదారులను ఎంపిక చేయడానికే పరిమితమైంది తప్ప నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. గతంలో రూ.15 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ లబ్ధిదారుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఈ ఏడాదికి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్యను పెంచినప్పటికీ ఇంకా ఆ మేరకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఎంపికైన అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ కనీసం ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా చెల్లించలేదు.
విదేశీవిద్యా నిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలే దాదాపు రూ.260 కోట్ల మేరకు పేరుకుపోయినట్టు అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. 2023 సంవత్సరంలో రెండు సీజన్లకు సంబంధించి రూ.104.42 కోట్లు, 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.140.74 కోట్లు, 2025-26 ఫాల్ సీజన్‌కు సంబంధించి మరో రూ.60 కోట్లు కలిపి రూ.305 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇవికాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి విదేశీవిద్యానిధి స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఇన్స్టాల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు మాత్రమే చెల్లించారు. మరో ఇన్స్టాల్మెంట్ కింద రూ.10 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉన్నది. వాటిని కూడా కలిపితే మొత్తం బకాయిలు రూ.350 కోట్లు దాటిపోతున్నాయి. వాటిని మార్చిలోగా చెల్లిస్తామని నిరుడు డిసెంబర్లో మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
పెండింగ్ బకాయిలు భారీగా పేరుకుపోయినప్పటికీ స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం.. మళ్లీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కోసం అర్హులైన బీసీ, ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. బీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా, ఎస్సీ విద్యార్థులు అక్టోబర్ 19లోగా https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.