హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): నిరసన విద్యార్థుల ప్రాథమిక హక్కు అని, కాన్వొకేషన్ నిర్వహణకు ముందస్తు షరతులు విధించడం అనుచితమని నల్సార్ లా యూనివర్సిటీ ఎస్బీసీ మండిపడింది. కాన్వొకేషన్ వేడుకను రద్దు చేసి, డిగ్రీలను ఇన్-ఆబ్సెంటియా పద్ధతిలో ఇవ్వాలని బెంగళూరులోని నేషనల్ లా సూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ యంత్రాంగం నిర్ణయించడం విద్యార్థుల ఉత్సాహాన్ని నీరుగార్చడమేనని ఆవేదన వ్యక్తంచేసింది.
బెంగళూరులోని నేషనల్ లా సూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ నిర్వహించాల్సిన 34వ వార్షిక స్నాతకోత్సవం రద్దు కావడంపై హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్టూడెంట్ బార్ కౌన్సిల్ నిరసన వ్యక్తంచేసింది. ఎన్ఎల్ఎస్ఐయూ వి ద్యార్థులకు పూర్తి మద్దతు తెలియజేస్తూ నల్సార్ విద్యార్థి సంఘం సోమవారం ప్రకటన విడుదల చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను కాన్వొకేషన్‌కు పునరాహ్వానిస్తూ బహిరంగ లేఖ రాయాలని ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని నల్సార్ ఎస్బీసీ ఖండించింది.