నిరుద్యోగ శాతంలోనూ తగ్గుదల తథ్యం
దేశ విదేశాల్లో ఎక్కడైనా రాణించవచ్చు
ఇంగ్లిష్ మీడియం చదువక ఇబ్బంది పడ్డా
‘మన ఊరు-మన బడి’ మంచి కార్యక్రమం
కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వెంకటేశ్వర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఆంగ్లం అంతర్జాతీయ భాష. ఇందులో పరిజ్ఞానం సాధిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయవచ్చు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని, ఫలితంగా నిరుద్యోగం లేకుండా పోతుందని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీసీ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సిద్దిపేటకు చెందిన తాను తెలుగు మీడియంలో చదివి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని తెలిపారు. నిరుపేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడిలో భాగంగా ఇంగ్లిష్ మీడియంలో బోధించాలని నిర్ణయించడాన్ని స్వాగతించారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు ఆయన మాటల్లో..
భవిష్యత్తుకు భరోసా
ఇంగ్లిష్ మీడియంలో అందుబాటులో లేక తెలుగు మీడియంలో చదువుకున్న గ్రామీణ, పేద విద్యార్థుల్లో 50 శాతం మంది పదో తరగతి, ఇంటర్మీడియట్, కొందరు డిగ్రీకే పరిమితమవుతున్నారు. తర్వాత పీజీ చేయాలంటే ఆంగ్లంపై అవగాహన తప్పనిసరి. భాషపై పట్టు లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. దీంతో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆశయాలను పక్కనబెట్టి చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక వేళ బాల్యం నుంచే ఇంగ్లిష్‌పై పట్టు ఉంటే గ్రామీణ, పేద విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి ప్రపంచ పోకడలను తెలుసుకుంటారు. బీటెక్, ఎంటెక్, విదేశాల్లో ఎంఎస్ కూడా పూర్తిచేస్తారు. మార్కెట్లో ఏ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయో ఎవరినీ అడగకుండానే ఇంటర్నెట్లోనే తెలుసుకుంటారు. ట్రెండ్‌కు తగిన కోర్సులు ఇంగ్లిష్‌లోనే పూర్తిచేసి ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్ రంగాల్లో స్థిరపడే అవకాశం ఉన్నది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉన్నతస్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉన్నది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నప్పటికీ మాతృభాష తెలుగును గౌరవించాలి. స్థానిక పరిస్థితులు, సంప్రదాయాలను తెలుసుకోవాలంటే తెలుగుభాషపై అవగాహన తప్పనిసరి. అన్ని ప్రభుత్వ బడుల్లో తెలుగు భాషను తప్పకుండా బోధించేలా చర్యలు తీసుకోవాలి.
పరిశోధనలు పెరుగుతాయి
ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారిలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ బోధనతో యూజీ, పీజీ స్థాయికి వెళ్లేలోగా విద్యార్థికి సంపూర్ణ పరిజ్ఞానం వస్తుంది. దీంతో పీహెచ్డీ ప్రవేశాలకు సులభంగా ఎంపికవుతారు. పరిశోధనలు మెరుగుపడుతాయి. పరిశోధనలకు కావాల్సిన సమాచారం గైడ్ సూచనలతో గూగుల్, సోషల్ మీడియా, ఇ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీల ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్‌తో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేయడం కష్టమవుతున్నది. కొందరు మధ్యలోనే వదిలేస్తుండగా, మరి కొందరి పరిశోధన పూర్తి కావడానికి కనీసం పదేండ్లు పడుతున్నది. పరిశోధనలకు కావాల్సిన సమాచారం (రిఫరెన్స్ పుస్తకాలు) తెలుగు మీడియంలో అందుబాటులో ఉండకపోవడం ప్రధానలోపం.
తెలుగు మీడియం నుంచే వచ్చా
సిద్దిపేట జిల్లాకు చెందిన నేను పాఠశాల విద్యా నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదివా. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశం పొందా. తర్వాత కామర్స్ సబ్జెక్టుతో పీజీలో ఇంగ్లిష్ మీడియంలోనే చేరా. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల మూడేండ్ల యూజీ, రెండేండ్ల పీజీ కోర్సు పూర్తి చేయడానికి అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంగ్లిష్ బోధన అంత సులభంగా అర్థమయ్యేది కాదు. దీంతో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల కంటే ఎక్కువ గంటలు కష్టపడాల్సి వచ్చేది. మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నట్టయితే ఆ ఇబ్బంది ఉండేదికాదు. ప్రస్తుతం ప్రభుత్వం మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టడం అభినందనీయం. గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు భవిష్యత్తు బంగారంగా మారుతుంది.