పెద్దకొత్తపల్లి, జూన్ 18 : ‘ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ విద్యార్థులు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో నిరసనకు దిగారు. గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి గంటసేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వాలు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ క్రమంలో యాజమాన్యాలు అధిక ఫీజులు దండుకుంటున్నాయని వాపోయారు. ఇప్పటికైనా విద్యార్థులను సర్కారు పాఠశాలలకే పంపించాలని కోరారు.
త్వరలో పూర్తిస్థాయిలో ‘విద్యా సమీక్ష కేంద్రం’ ; పాఠశాల విద్యాశాఖ నూతన డైరెక్టర్ నవీన్ నికోలస్
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను(విద్యా సమీక్ష కేంద్రం) త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పాఠశాల విద్యాశాఖ నూతన డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తాను కేంద్ర విద్యాశాఖలో పనిచేసే సమయంలోనే విద్యా సమీక్ష కేంద్రాలకు రూపకల్పన చేశామని, గుజరాత్లో తాము ఏర్పాటుచేసిన కేంద్రానికి ప్రధానమంత్రి అవార్డు వచ్చిందని గుర్తచేశారు. రాష్ట్రంలో ఏర్పాటైన విద్యా సమీక్ష కేంద్రం పనితీరుపై ఆరా తీశారు. ఈ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మొత్తం మూడు దశలుండగా, ఇప్పటికే రెండు దశలు పూర్తయినట్టు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైట్లు, యాప్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అనుసంధానించాల్సి ఉన్నట్టు వెల్లడించారు.