Kodandaram | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కోదండరాంకు హెచ్సీయూ భూములపై విద్యార్థుల నిరసన సెగ తగిలింది. బుధవారం ఢిల్లీలో కలిసిన ఎమ్మెల్సీ కోదండరాంను హెచ్సీయూ విద్యార్థులు చుట్టుముట్టి ప్రశ్నలవర్షం కురిపించారు. హెచ్సీయూ భూములను ప్రభుత్వం అమ్మేస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదని విద్యార్థులు నిలదీశారు.
కోదండరాం నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ మాట్లాడారు. చివరకు విద్యార్థుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘పదవి లేకపోతే అభ్యుదయ వాదులు, పదవి వచ్చాక కాగితం పులులుగా మారిపోయారు’ అంటూ సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు ఏకి పారేశారు.