JEE Advanced | హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ గురుకులం నుంచి 450 మందికిపైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయగా, ఇందులో 86 మంది ర్యాంకులు పొందారు. త్రివేణి ఆలిండియా స్థాయిలో 205 ర్యాంకు క్యాటగిరీలో 83వ ర్యాంకు, సాత్విక్ ఆలిండియాలో 2,721 ర్యాంకు – క్యాటగిరీలో 53 ర్యాంకు , రామకృష్ణ ఆలిండియాలో 2,734 ర్యాంకు-క్యాటగిరీలో 477 ర్యాంకు , గణేశ్ ఆలిండియాలో 9,615 ర్యాంకు క్యాటగిరీలో 260 ర్యాంకును సొంత చేసుకోవడం విశేషం. ఎస్టీ గురుకులాల నుంచి 450 మంది పరీక్షకు హాజరుకాగా, 96 మంది ర్యాంకులను సాధించారు. లకావత్ సాయిచరణ్ ఆలిండియా స్థాయిలో 3,373 క్యాటగిరీలో 30, ప్రవీణ్ ఆలిండియాస్థాయిలో 5,833క్యాటగిరీలో 63, బోడ ప్రవీణ్ ఆలిండియా స్థాయిలో 6,840 క్యాటగిరీలో 63వ ర్యాంకు పొందారు. ఈ ఏడాది తొలిసారిగా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్ (పీవీటీజీ)కు చెందిన గురుకుల విద్యార్థులు రవికుమార్ 164, నిత్య శ్రీ 182 ర్యాంకులను సాధించడం గర్వకారణం. ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి మొత్తం 236 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించడం మరోవిశేషం.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి ర్యాంకులు పొందేలా గురుకుల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ అధ్యక్షుడు బాలరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజేంద్రనగర్లోని గిరిజన బాలుర ఐఐటీ స్టడీ సెంటర్ నుంచి 63 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇందులో 51 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు.