వనపర్తి టౌన్, సెప్టెంబర్ 9 : తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్‌కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలెక్టర్‌కు వినతిప్రతం రాశారు. ‘ప్రిన్సిపాల్ గురువయ్య.. విద్యార్థులను దుర్భాషలాడుతున్నాడు. అవసరం లేకున్నా తల్లిదండ్రుల నుంచి రకరకాల వస్తువులు ఇప్పించడానికి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారు. పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులతో మమ్మల్ని తిట్టిస్తున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రిన్సిపాల్, వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. 70 మంది పదోతరగతి విద్యార్థులు ఈ పత్రంతో మంగళవారం ఉదయం 9:30 గంటల తర్వాత గురుకుల పాఠశాల ప్రహరీ దూకి వనపర్తి జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టారు. పాఠశాల ఆవరణలోని పంట పొలాల మీదుగా వెళ్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని అడ్డగించారు. పలువురు నాయకులు చేరుకుని విషయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులకు ఆయన సర్దిచెప్పారు.