భువనగిరి అర్బన్ : స్కాలర్షిప్, ఫీజు రీయింబర్‌మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్‌మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో ఉమ్మడి జిల్లా వరదల ప్రత్యేకాధికారి, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక కాన్వాయ్‌ను సోమవారం వరదబాధితులు అడ్డుకున్నారు. వరదముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా వివిధ శాఖల అధికారులతో కలిసి జంపన్నవాగును పరిశీలించేందుకు ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక వెళ్లారు. కొండాయిలోని ముంపు ప్రాంతానికి చెందిన వరదబాధితులు దొడ్ల సమీపంలో ఆయనను అడ్డుకున్నారు. వరదలతో భయాందోళనకు గురవుతున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
– ఏటూరునాగారం
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లోగా జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు డిమాండ్‌చేశారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఆదివాసీలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. కలెక్టరేట్ వద్ద 3 గంటలపాటు ధర్నా చేపట్టారు. జీవో రద్దు చేయకుంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
– కుమ్రంభీం ఆసిఫాబాద్