వేంసూరు, ఆగస్టు 24 : అల్పాహారం తిని పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జడ్పీహెచ్ఎస్లో సోమవారం ఉ దయం చోటుచేసుకున్నది. ఓ ట్రస్టు ఆధ్వర్యంలో తొలిరోజు మర్లపాడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఉప్మా అందించారు. 6, 7వ తరగతులకు చెందిన పదిమంది విద్యార్థులు కడుపులో నొప్పిగా ఉన్నదని ఉపాధ్యాయులకు చెప్పడంతో వెంటనే వారిని వేంసూరు పీహెచ్సీకి తరలించగా వైద్యం అందించారు. రోజువారీగా అల్పాహారం అలవాటు లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అల్పాహారం పంపిణీలో నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు.