హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే విద్యార్థిని చనిపోయిందని, నాగర్ కర్నూల్లో ప్రవీణ్ అనే ఎస్సీ విద్యార్థి కూడా మరణించాడని పిటిషనర్ న్యాయవాది చికుడు ప్రభాకర్ హైకోర్టుకు వివరించారు. హైకోర్టు గత ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే ఈ తరహాలో విద్యార్థులు మరణిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు దవాఖాన పాలవుతున్నారని అన్నారు. మాగనూరు, కరీంనగర్ జిల్లాలోని మరొక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించిందని చెప్పారు. ఈ అంశాలపై రెండు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. మధ్యాహ్న భోజన పథకం అమలు మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభాకర్ చెప్పారు. నోడల్ ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు ఘటనలపై మరో కమిటీ వేసిందని అన్నారు. ఈ వ్యవహారాలపై ఇరుపక్షాలు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.