పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలతో పాటు, మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు చెందిన పాత మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో గత విద్యా సంవత్సరమే వాటిని మూసి వేసారు. అప్పటి నుండి పాఠశాలలో మరుగుదొడ్లు లేక పోవడంతో బాలికలతో పాటు, మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితితుల్లో సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు.
బాలురు పాఠశాల బయటకు వెళుతుండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జడ్పీ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల నిర్మాణం కోసం గత సంవత్సరం ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో బాలురు, బాలికలకు వేరు వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రూ.4 లక్షల చొప్పున రూ.8 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులను ప్రాంభించడంలోనూ సంబంధిత అధికారులు తీవ్ర జాప్యం చేశారనే ఆరోపణులున్నాయి.
మరుగుదొడ్ల నిర్మాణ పనులను అధికారులు ఇటీవల ప్రారంభించినప్పటికి పనులు గోడల వరకు చేసి, మధ్యలోనే నిలిపి వేశారు. పాత మరుగుదొడ్లు లేక, కొత్తవి నిర్మాణ పనులు కాక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.