మేడ్చల్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్‌లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గజగజ వణుకుతున్నామని.. తమ సమస్యలు పరిష్కరించాలని గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. నిత్యం నరకయాతన నుంచి తప్పించండి సార్ అంటూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట సీఐ శ్రీనాథ్‌ను కలిసి వేడుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. కాగా, పాఠశాల పిల్లలిలా పోలీసులను ఆశ్రయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో ఉన్న మహాత్మాజ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్(గురుకుల పాఠశాల) పదో తరగతి విద్యార్థులు గురువారం పాఠశాల నుంచి శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి సీఐ శ్రీనాథ్‌కు తమ సమస్యలు చెప్పుకొని విలపించారు. తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని, వసతిగృహంలో సరైన వసతులు లేవని, కప్పు పెచ్చులూడుతున్నదని, పాఠశాలలో బాత్రూమ్లకు డోర్లు లేక, పరిసరాలు అపరిశ్రుభంగా ఉన్నాయని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై ప్రిన్సిపాల్ సహా సిబ్బందికి పలుమార్లు విన్నవిస్తే, తమనే దుర్భాషలాడుతున్నారు తప్ప పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రెండు వారాలుగా పురుగుల అన్నమే తింటున్నామని, చలిలోనే ఉంటున్నామని, బాత్రూమ్లలో నీళ్లు రాక, వంట పాత్రలను బాత్రూమ్లు కడిగే బ్రష్‌లను వాడుతున్నారని.. ఇలా రోజూ నరకం చూస్తున్నామని సీఐకి చెప్పారు. ప్రిన్సిపాల్ వసతిగృహాన్ని ఎప్పుడూ సందర్శించలేదని, ఉదయం 11గంటల వరకే ఉంటే విద్యార్థుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అందుకే పోలీస్‌స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని విద్యార్థులు తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేశారు. శామీర్‌పేట గురుకులంలో శామీర్‌పేటతో పాటు హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌కు చెందిన విద్యార్థులు చదువుకుంటుండగా, వారు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన విషయం తెలిసి అధికారులు హూటాహుటిన గురుకులాన్ని సందర్శించారు.
బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఝాన్సీరాణి, డీఎస్వో శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. వంటశాల, బాత్రూమ్లతో పాటు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పాఠశాల సిబ్బంది తీరు అసలేం బాగాలేదని, ప్రిన్సిపాల్ పట్టించుకోరని విద్యార్థులు వారికి చెప్పారు. అదనపు కలెక్టర్ రాధికాగుప్తా ఆదేశాల మేరకు సమస్యలు తెలుసుకున్నామని, కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని వారు తెలిపారు.
గురుకులాల్లో వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల నాగారం మైనారిటీ గురుకులంలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, కీసర బాలికల గురుకులంలో ఎలుకలు గాయపర్చాయి. ఇన్ని జరుగుతున్నా ప్ర భుత్వం పట్టించుకోదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.