మహబూబ్‌నగర్, ఆగస్టు 11: ఫోన్లో మాట్లాడుతున్నాడని ఓ విద్యార్థిని కళాశాల సిబ్బంది చితకబాదింది. ఈ ఘటన ఆదివా రం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. పుట్టపాగ ఉమేశ్ లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం ఫోన్లో మాట్లాడుతున్నాడని కళాశాల సిబ్బంది వాతలుపడేలా చేతులపై కొట్టారు. విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నించారు. విద్యార్థులకు ఎవరికైనా చెప్తే.. అంతు చూస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి ఉమేశ్‌ను దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించారు.
తండ్రి చనిపోయినా ఉన్నతం గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చదివిస్తున్నానని బాధితుడి తల్లి వాపోయింది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ బాలస్వామి మాట్లాడుతూ.. ‘విద్యార్థి ఫోన్లో మాట్లాడాడని రెండు దెబ్బలు వేశా రు.. ఈ సమస్యను పెద్దదిగా చేయకండి.. నేను మాట్లాడతా.. రేపు కళాశాలకు వెళ్లి సమ స్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. జిల్లా సమన్వయకర్త శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. ‘ఈ కాలంలో కూడా దవాఖాన పాలయ్యేలా కొడతారా? అలా ఏం జరిగి ఉండదు.. విషయంపై వాకబు చేస్తా. ఒకవేళ కొట్టినట్టు తెలిస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటా’ అని పేర్కొన్నారు.