ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఖమ్మం జిల్లా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. సాంఘిక సంక్షేమ గురుకులాల ఖమ్మం జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఖమ్మంలోని బీఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (సీవోఈ)లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురుకులాల కార్యదర్శి వర్షిణి బుధవారం ఖమ్మం వచ్చారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఎదుట ఆందోళన చేపట్టేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మంలోని అంబేద్కర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గురుకులాల కార్యదర్శి.. విద్యార్థి సంఘాల నేతలను చూసి వాహనాన్ని ఆపకుండానే దానవాయిగూడెంలోని గురుకుల పాఠశాల సందర్శనగాకు వెళ్లారు.
ఆమె దానవాయిగూడెం గురుకులానికి చేరుకున్నారన్న సమాచారం తెలుసుకున్న విద్యార్థి నేతలు.. అక్కడికి కూడా వెళ్లి ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో ఆమెకు వినతిపత్రం ఇచ్చేందుకు నాయకులు ప్రయత్నించారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో కొందరు నాయకులు ఫొటోలు, వీడియోలు తీస్తున్న విషయాన్ని గమనించిన కార్యదర్శి.. వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫొటోలు, వీడియోలు తీయొద్దంటూ మందలించారు. అప్పటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఆమె పోలీసు వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. గురుకులాల సమస్యలపై తాము వినతిపత్రం ఇస్తే తీసుకోకుండా అహంకారంతో వ్యవహరించిన కార్యదర్శి వర్షిణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వైఖరిని నిరసిస్తూ గురువారం అన్ని నియోజకవర్గాల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు.