హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పాఠశాల దశలోనే విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలను వెలికి తీసేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న నిర్ణయం తీసుకున్నది. సర్కారు బడుల్లో ‘స్కూల్ కెప్టెన్’ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రతి బడికి స్కూల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ నలుగురు గ్రూప్ కెప్టెన్ చొప్పున ఆరుగురు లీడర్లుంటారు. ప్రతి బడికి ఆరుగురు లీడర్లను నియమిస్తారు. వీరిని నామినేటెడ్ పద్ధతిలోనే నియమిస్తారు. ఓట్లు, ఎన్నికలు వంటివి ఉండవు. స్టూడెంట్ లీడర్ విధానం ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ కొంతకాలం క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలకు తాజాగా సర్కారు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి విధానం ఇప్పటికే పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో అ మల్లో ఉంది. ఇదే తరహాలోనే సర్కారు బడుల్లోనూ ప్రవేశపెట్టనున్నారు.