వికారాబాద్, నవంబర్ 12 : విద్యుత్తు షాక్ తగిలి పాఠశాల విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్లో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రాథమిక పాఠశాల బయట ఎలాంటి రక్షణ కంచ లేకుండా 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ పాఠశాల ప్రహరీకి అనుకొని ఉంది.
బుధవారం పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న వంశీ మధ్యాహ్న భోజనం చేయడానికి వస్తుండగా ట్రాన్స్ఫార్మర్ తీగ తగిలింది. దీంతో చేతులు, కాళ్లు, తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు, స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన సదుపాయాలు లేకపోవడంతో స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం వికారాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.