నల్లగొండ ఆగస్టు 25: నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా కోసం వరుసలో వేచి వేచి నిరాశతో తిరిగి వెళ్లిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాయలి మితిలేష్.. సోమవారం పొద్దున్నే పాఠశాలకు వెళ్లాలని యూనిఫామ్ వేసుకొని తయారయ్యాడు.
అయితే తమకు పొలం వద్ద పని ఉందని, దయచేసి రెండు యూరియా బస్తాలు ఇచ్చిపోమని తల్లిదండ్రులు బతిమిలాడారు. దాంతో యూనిఫామ్తోనే వచ్చిన మితిలేష్ మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఎన్డీసీఎంఎస్ వద్ద ఉదయం 6 గంటలకే క్యూలైన్లో నిలిచి ఉన్నాడు. అప్పటికే తన ముందు ఉన్న లైన్ కాస్త పెద్దగా ఉండటంతో.. అతని వరస వచ్చేసరికి ఒక్క బస్తా కూడా రాకపోవడంతో నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి యూరియా దొరకలేదని, తాను స్కూల్కు వెళ్తున్నాను అని చెప్పి ఆలస్యంగా బడికి వెళ్లాడు.
కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సహకార సంఘాలు, ఆగ్రో కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులుతీరారు. త్రిపురారం, శాలిగౌరారం పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం పెద్దసంఖ్యలో నిరీక్షిస్తున్నారు. శాలిగౌరారం వద్ద క్యూలైన్లో ఆధార్ కార్డులు, చెప్పులు ఉంచారు. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు.
త్రిపురారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం సాయంత్రమే యూరియా వచ్చింది అని తెలియడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన రైతులు.
నార్కట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం రైతు వేదిక వద్ద యూరియా కోసం పొద్దున 5 గంటల నుంచి బారులు తీరిన రైతన్నలు.
మిర్యాలగూడ మండలం అలగడప సొసైటీలో యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టిన రైతులు.
యాదాద్రి భువనగిరి అడ్డగూడూరులో సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు.