మెట్పల్లి రూరల్, మార్చి 27: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. మెట్‌పల్లికి చెందిన రాపర్తి హర్ష గురువారం కుడిచేతికి నొప్పి వస్తున్నదని, కండ్లు తిరుగుతున్నాయని ప్రిన్సిపాల్ మాధవీలతతో తెలిపాడు. వెంటనే కోరుట్ల దవాఖానలో చేర్పించగా వైద్యులు చికిత్స అందించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ హర్షను పరామర్శించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉండటం తో ఇంటికి పంపించారు.
నిరుడు జూలై 26న అస్వస్థతకు గురై కోలుకున్న హర్ష మళ్లీ అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించింది. పెద్దాపూర్ గురుకులంలో అయిలాపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సమీనా ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. 56 మంది విద్యార్థులు స్కిన్ అలర్జీ, కడుపునొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించి చికిత్స అందించారు. గతేడాది జూలై 26న ఓ విద్యార్థి, ఆగస్టు 9న మరో విద్యార్థి మృతిచెందగా, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై కోలుకున్నారు. గత డిసెంబర్ 18న మరో విద్యార్థి అస్వస్థతకు గురై ప్రాణాలతో బయటపడిన ఘటన మరవకముందే మరో విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.