తొర్రూరు, జూలై 29 : ఆన్లైన్ పుస్తకాల మాయలో పడి, ఒంటరిగా జీవించడంపై ఆసక్తి పెంచుకుని డిప్రెషన్‌కులోనై విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మర్రికుంట తండాకు చెందిన బానోత్ వెంకన్న- అనిత దంపతుల కుమారుడు బానోత్ వెంకట్చైతన్య(15) తొర్రూరులోని అభ్యాస్ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల వెంకట్చైతన్య ‘ఒంటరిగా జీవించడం ఎలా’ అనే అంశంపై ఆసక్తి పెంచుకొని, ఆన్లైన్ ద్వారా వచ్చిన పుస్తకాలు చదువుతూ డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఈ నెల 27న పాఠశాల హాస్టల్లో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే యాజమాన్యం అతడిని తొర్రూరులోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. కుటుంబసభ్యులు ఎంజీఎం దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి హైదరాబాద్ యశోద దవాఖానకు తీసుకెళ్తుండగా వెంకట్చైతన్య మృతి చెందాడు. మంగళవారం కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు సూల్ ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టారు. విద్యార్థి మృతికి సూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు. సీఐ గణేశ్, ఎస్సై ఉపేందర్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై కేసు నమోదు చేశారు. విద్యార్థి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై ఉపేందర్ తెలిపారు.