సిద్దిపేట, జనవరి 3: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో శనివారం తెల్లవారుజామున ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. బాలిక బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లికి చెందిన గుర్రం తిరుపతిరెడ్డి, శ్రావణి దంపతుల కుమార్తెలు వర్ష్ష, హర్షిణి మిట్టపల్లిలోని కేజీబీవీలో చదువుతున్నారు. వర్ష 9వ తరగతి, హర్షిణి ఏడోతరగతి చదువుతుండగా.. పోయిన నెల ఇంటి వద్ద పండుగ ఉన్నదని వెళ్లి అదే నెల 26న హాస్టల్ కు వచ్చారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్లో ఆడుకుంటున్న హర్షిణి ఒకసారిగా స్పృహతప్పి పడిపోయింది.
తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలుపగా వారు హుటాహుటిన సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీకి తరలించారు. అకడ పరీక్షించిన వైద్యులు విద్యార్థిని అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. వెంటనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని భోరున విలపించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.