ములుగు, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ): గురుకులం విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. ములుగు మండలం జంగాలపల్లికి చెందిన కొయ్యడ కార్తీకశ్రీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యార్థిని మెట్ల మార్గంలో భవనంపైకి ఎక్కి వెనుక వైపు దూకింది. చుట్టుపక్కల ఇండ్ల యజమానులు చూసి గురుకుల సిబ్బందికి తెలిపారు. చాలా సేపటి తర్వాత సదరు ఉపాధ్యాయినులు వచ్చి గురుకులం లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న బాలికను చూసిన చుట్టుపక్కల వారు దవాఖానకు తీసుకెళ్లాలని గొడవ చేయడంతో ఆటోలో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరీక్షించిన వైద్యులు నడుముతోపాటు పక్కటెముకలు విరిగినట్టుగా గుర్తించి, మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించగా ఎంజీఎంలో సైతం బెడ్లు ఖాళీ లేకపోవడంతో సుమారు గంటపాటు అంబులెన్స్ స్ట్రెచర్‌పైనే విద్యార్థిని అవస్థ పడినట్టు డ్రైవర్ తెలిపారు. అనంతరం వైద్యులు పరీక్షించి చికిత్స ప్రారంభించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. కాగా, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులపై పర్యవేక్షణ లోపించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఇటీవల బండారుపల్లి టీజీఆర్ గురుకులంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని అంటున్నారు.