కరీంనగర్ రాంనగర్/ తిమ్మాపూర్, జూలై 4 : ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ విద్యార్థి వాటిని తీర్చడానికి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు దోపిడీకి పాల్పడి ఓ వృద్ధురాలిని హత్య చేయడానికి యత్నించి, చివరకు జైలు పాలయ్యాడు. శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన దమ్మ దినేశ్‌రెడ్డి కరీంనగర్లో ఉంటూ డిగ్రీ ద్వితీయ సంవంత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో రూ.4.50 లక్షల వరకు నష్టపోయాడు. వాటిని తీర్చడానికి ఆన్లైన్ యాప్‌ల ద్వారా అప్పులు చేశాడు. దారిదోపీడీకి పాల్పడి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల పాటు ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులపై రెక్కీ నిర్వహించాడు.
ఈ నెల 1న టవర్‌సర్కిల్ ప్రాంతంలోని లేబర్ అడ్డా వద్ద కూలి పని చేసుకునే కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి పని కోసం వేచి చూస్తున్న క్రమంలో దినేశ్‌రెడ్డి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్రాంతంలో పని ఉందంటూ ఆమెను ర్యాపిడో ద్వారా అక్కడికి రప్పించుకున్నాడు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 5 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి పట్టీలను లాక్కున్నాడు. అనంతరం సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఆమెను తోసేసి వెళ్లిపోయాడు. లక్ష్మి నుంచి దొంగిలించిన 5 గ్రాముల బంగారాన్ని కరీంనగర్ టవర్‌సర్కిల్ ప్రాంతంలో నగల వ్యాపారి(మనోహరాచారి)కి రూ.30 వేలకు విక్రయించాడు. రాత్రి అయినా లక్ష్మి ఇంటికి రాకపోవడంతో ఆమె కొడుకు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2న అటుగా వచ్చిన రైతులు ఆమె కేకలు విని రక్షించగా.. పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని మార్కెట్ వద్ద పోలీసులు పట్టుకుని శనివారం సీన్ రీకన్స్‌స్ట్రక్షన్ చేశారు. అతడి నుంచి రూ.5 వేల నగదు, 20 గ్రాముల వెండి పట్టీలు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని సైతం అరెస్టు చేసి జైలుకు పంపించారు.