ముథోల్, జూన్ 17: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అస్మితా బేగం బాసర ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్ చదువుతున్నది. ఈ క్రమంలో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన అధ్యాపకులు వెంటనే భైంసా దవాఖానకు, అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.