Fever Hospital | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)/అంబర్‌పేట: ఉష్ణమండల వ్యాధులకు కొన్ని దశాబ్దాలుగా చికిత్సనందిస్తూ తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పేదలకు ఆదరువుగానున్న కోరంటి దవాఖాన (ఫీవర్ హాస్పిటల్) వైద్యుల కొరతతో కునారిల్లుతున్నది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు, ఫ్లూ, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు కోరంటి దవాఖాన పెట్టింది పేరు. కార్పొరేట్లో కూడా నయం కాని మొండి జ్వరాలు, సీజనల్ వ్యాధులకు ఇక్కడి చికిత్సతో చెక్ పడుతుందనేది రోగుల నమ్మకం. బీఆఎర్ఎస్ హయాంలో నూతనంగా వైరాలజీ ల్యాబ్, పీజీ హాస్టల్ భవనం, ఆధునిక హంగులతో లైబ్రరీ, పలు రకాల వైద్యపరీక్షలు జరిపేందుకు అవసరమైన పరికరాలు తదితర సదుపాయాలతో కార్పొరేట్‌కు దీటుగా కోరంటిని తీర్చిదిద్దారు.
దవాఖానలో గత ఏడాది చేపట్టిన వైద్యుల బదిలీలు రోగులకు శాపంగా మారింది. బదిలీ అయినవారి పోస్టులను భర్తీ చేయకపోవడంతో వైద్యుల కొరత ఏర్పడి, మెరుగైన చికిత్స అందించే డాక్టర్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా ఒక్కో యూనిట్‌కు ఒక్కో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ బదిలీలతో హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. కొంతకాలం వరకు సూపరింటెండెంట్ కూడా లేకపోవడంతో ఆర్ఎంఓనే ఆ బాధ్యతలను నిర్వహించారు. ఇటీవలనే ఉస్మానియా దవాఖాన నుంచి డాక్టర్ రాజేంద్రపసాద్ను కోరంటి సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన ఇటు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క రెండు యూనిట్లకు ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
దవాఖానలో ఉన్న మూడు యూనిట్లకు ముగ్గురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కాని ప్రస్తుతం సూపరింటెండెంట్ మినహా మిగిలిన రెండు యూనిట్లలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్), పీజీలతో వైద్య సేవలు అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా దవాఖాన నుంచి వచ్చిన ఇద్దరు సీనియర్ రెసిడెంట్స్, గాంధీ నుంచి వచ్చిన ఐదుగురు పీజీలు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లే దవాఖానకు దిక్కయ్యారు.
టీచింగ్ హాస్పిటలైన కోరంటిలో వైద్య విద్యను బోధించాల్సిన ప్రొఫెసర్లు లేకపోవడంతో అక్కడి మెడికల్ స్టూడెంట్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైద్యుల కొరత కారణంగా అటు రోగులకు వైద్యసేవలు అందకపోవడమే కాకుండా జూనియర్ డాక్టర్లకు మెరుగైన వైద్య విద్య అందకపోగా, వారిపై పనిభారం కూడా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది.
కోరంటిలో చిన్నపిల్లల వైద్యనిపుణులకు సంబంధించిన ఒక పోస్టు కొంతకాలంగా ఖాళీగానే ఉంది. దీంతో ఎవరైనా చిన్నపిల్లలు విషజ్వరాలకు గురై దవాఖానకు వస్తే వారిని నిలోఫర్ దవాఖానకు రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దవాఖానలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైరాలజీ ల్యాబ్‌లో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ ల్యాబ్‌లో జరిగే వైద్యపరీక్షలను పర్యవేక్షించే నాథుడు కరువయ్యాడు. దీంతో వైరాలజీల్యాబ్‌లో జరిగే వైద్యపరీక్షలకు విశ్వాసనీయత కొరవడింది.
ఏకకాలంలో పలు రకాల వైద్యపరీక్షలు జరిపే వీలున్న ‘చెక్మెన్ ఎనలైజర్’ యంత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందించారు. అది ఏడాది కాలంగా మూలకు పడింది. దానికి మరమ్మతు చేయించకపోవడంతో వైద్యపరీక్షల్లో జాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం ఇతర యంత్రాలపై వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు సిబ్బ ంది చెప్తున్నారు. రోగుల సౌకర్యార్థం సమకూర్చిన మొబైల్ ఎక్స్‌రే మిషన్ కూడా గత కొంతకాలంగా పనిచేయడం లేదు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదని రోగులు వాపోతున్నారు.