హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా తర్వాత పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్టు గురుకుల టీచర్ల జేఏసీ, టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని పలు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల విద్యాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న 25 రకాల డిమాండ్ల సాధనకు కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోలేదని వాపోయారు.
దీంతో దసరా సెలవులు ముగిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతోపాటు తెలంగాణ గురుకులాల్లో పేరుకుపోయిన విద్యార్థుల, ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారానికి నిత్యం పోరాటం చేయడానికి వెనకాడే ప్రసక్తే లేదని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చావ రవి స్పష్టంచేశారు. మద్దతు ఇచ్చే ఉపాధ్యాయులందరిని కలుపుకొని పోతామని పేర్కొన్నారు. పాత టైంటేబుల్‌ను కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా 25 శాతం వరకు మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 25 రకాల డిమాండ్లు ఉన్నాయని, వాటి పరిష్కారానికి పోరాడుతామని ఆ సంఘం నాయకులు స్పష్టంచేశారు.