హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బ్యాంకింగ్ చట్టాల సవరణతో పలు దీర్ఘకాలిక సవాళ్లకు పరిష్కారం లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ.. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2024ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ఆర్థిక సేవలను విస్తరించడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
సైబర్ దాడులు ఆందోళనకరం
బ్యాంకింగ్ రంగానికి సైబర్ దాడుల ముప్పు విపరీతంగా పెరగడంపై ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. 2020-24 మధ్య దేశవ్యాప్తంగా 5.82 లక్షలకుపైగా సైబర్ మోసాలు జరిగాయని, ఫలితంగా రూ.3,207 కోట్ల నష్టం వాటిల్లిందని, ఒక్క 2023-24లోనే 2.92 లక్షల సైబర్ మోసాలతో రూ.2,054 కోట్లకుపైగా నష్టం జరిగిందని వివరించారు. ఈ మోసాలను అరికట్టాలంటే బలమైన సైబర్ భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. అధునాతన సైబర్ భద్రతా వ్యవస్థల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టేలా బ్యాంకులను ఆదేశించాలని, సురక్షిత బ్యాంకింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు దేశంలో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
కేసీఆర్ హయాంలో విప్లవాత్మక చర్యలు
సైబర్ నేరాల అడ్డుకట్టకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు వినూత్న చర్యలు చేపట్టారని ఎంపీ గుర్తుచేశారు. సుపరిపాలనతో రాష్ట్రంలోని అన్ని రంగాలను ప్రగతి బాట పట్టించిన కేసీఆర్.. వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిషారం చూపారని, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు గొప్ప మేలు చేశారన్నారు.