హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18న నిర్వహించే రాష్ట్రపతి ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి ఎన్నికల ప్రవర్తనా నియామవళిని అనుసరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. స్పీకర్, సీఎం సహా 119 మంది రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజీ సభ్యులతోపాటు ఏపీ నుంచి ఒక సభ్యుడు మొత్తం 120 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.