సిటీబ్యూరో: ఎవరైనా సోషల్ మీడియాలో పశువులను చంపుతున్నట్లు వీడియోలు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌లోని కాన్ఫరెన్స్హాల్లో సీపీ అధ్యక్షతన గో సేవా సంఘాలతో సమన్వయ సమావేశం జరిగింది.
గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పశువుల సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం, పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. కొందరు పశువులను చంపుతున్నట్లు వీడియోలను రీల్స్‌గా తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలా ఎవరైనా వీడియోలు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేశారు.