నిర్మల్ అర్బన్, జూన్ 19: విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి ద్వారా మూడేండ్లలో రూ.25 వేల కోట్లతో బడులను ప్రభుత్వం బాగు చేస్తున్నదని తెలిపారు. ప్రభు త్వ పాఠశాలల ఆవశ్యకత, మన ఊరు-మన బడి ప్రాధాన్యతలను వివరిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఆదివారం నిర్మల్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాలయాల్లో సీఎం కేసీఆర్ పెనుమార్పు తీసుకొచ్చారన్నారు. దీంతో ప్రైవేటును వీడుతూ వేల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగాల్లో సమూలమైన మార్పులు వచ్చాయని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వీటిని భ్రష్ఠుపట్టించాయని ఆరోపించారు. అనంతరం గండిరామన్న దత్త సాయి ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించే విగ్రహాల ఊరేగింపు శోభాయాత్రను మంత్రి ప్రారంభించారు.