హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): ఈనెల మొదటివారం నుంచి రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో విపరీతంగా ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితుల కారణంగా ఉదయం, మధ్యాహ్నం వేళలో అధిక ఎండలు, సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. ఎండల తీవ్రత కూడా సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా నమోదు అవుతున్నట్టు వెల్లడించింది.
ఈక్రమంలో వచ్చే వారంపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్టు ప్రకటించింది. మంగళవారం వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బుధవారం నల్లగొండ, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 24గంటల్లో సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, ములుగు, మెదక్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది. సంగారెడ్డి జిల్లా కాంగ్టిలో అత్యధికంగా 12.53 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.